 
													గత రెండు మూడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంది. అయితే ఒకరిద్దరు హీరోల మూవీస్ మినహా మిగిలినవి పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు 'బాహుబలి ద ఎపిక్' పేరిట.. దర్శకుడు రాజమౌళి సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు రీ రిలీజ్ అంటే ఫ్యాన్స్, సగటు ప్రేక్షకుల హంగామా మాత్రమే ఉండేది. బాహుబలి రీ రిలీజ్‌కి మాత్రం సెలబ్రిటీలు రివ్యూలు ఇస్తున్నారు.
ఓవర్సీస్‌లో 'బాహుబలి ఎపిక్' గురువారం రిలీజ్ కాగా.. మహేశ్ బాబు కొడుకు గౌతమ్ దీన్ని చూసి ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పాడు. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సోషల్ మీడియాలో తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. రాజమౌళికి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్‌కి సొంతంగా సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవడంతో ఇతడి భార్య లిఖిత తన ఇన్ స్టా స్టోరీలో రివ్యూని పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్.. తెలుగు ట్రైలర్ రిలీజ్)
'ఓ రోడ్‌కు మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది. ఆ బాధ్యతని ఓ కాంట్రాక్టర్‌కి అప్పగించారు. కానీ మరమ్మత్తులు వేయమని చెప్పిన రోడ్డుని ఏకంగా 16 లైన్ల సూపర్ ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చాడు. ఆ రోడ్ పేరు పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి టీమ్ మొత్తానికి నా అభినందనలు. ఓ తరం కోసం కలలు కన్నందుకు కృతజ్ఞతలు' అని ప్రశాంత్ నీల్ తనదైన రివ్యూ ఇచ్చేశాడు.
2015, 2017లో రిలీజైన బాహుబలి రెండు భాగాల్ని ఒక్కటిగా చేసిన 'ద ఎపిక్' పేరిట ఇప్పుడు రీ రిలీజ్ చేశారు. 3 గంటల 45 నిమిషాల నిడివితో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. చాలావరకు సీన్లని తీసేశారు. అదే టైంలో శివుడు(ప్రభాస్).. బాహుబలి రాజ్యంలో అడుగుపెట్టే సమయంలో నాజర్ పాత్రతో చెప్పించే సీన్లని కొత్తగా జోడించారు. అలానే చివరలో 'బాహుబలి' పేరుతో ఓ యానిమేటెడ్ మూవీ 2027లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: బాక్సాఫీస్‌కి బాహుబలి ‘జ్వరం'.. ఈసారి ఎన్ని రికార్డులో!)
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
