
ఇటీవల విడుదలైన లేడీ ఓరియంటెడ్ చిత్రం 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ ప్రేమకథా చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లలో ఆదరణ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఈ మూవీలో రెండు సీన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన కాశీలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా అని డైరెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ సమావేశానికి దర్శకుడు హాజరు కాలేదు.
ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్రాహ్మణ వర్గం పట్ల తనకు అమితమైన గౌరవముందని తెలిపారు. సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారని.. వారి నాలుకపైనే సరస్వతి కొలువై ఉంటుందని దర్శకుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కేవలం ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదన్నారు.
ఫణీంద్ర తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేరం చేసేవాళ్లు వారి విచక్షణా స్వభావంతోనే చేస్తారు.. కానీ వారి కులం, మతం ఆధారంగా చేయరు.. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారని నేను చూపించే ప్రయత్నం చేశా. కేవలం ఒక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి , మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు. ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను చదివి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి బట్టే నేరం చేస్తాడు. అంతేకానీ, అతని మతం, కులం అందుకు కారణం కాదు. అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఈ సినిమాలో కలపకండి. వేదికపై పంతులు అనకుండా ఉండాల్సింది. మీరు దాన్ని సరిచేయటంలో తప్పులేదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది మా టీమ్ ఉద్దేశం కాదు. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.
