
హారర్ జానర్‌లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్‌ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు.
పిచ్చిమాటలు, బూతులు
తాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్‌ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు.
నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడు
చొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను.
రూ.400 కోట్లతో రాజాసాబ్
బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్‌కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్‌ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి.
చిల్లర పనులు చేయొద్దు
అందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్‌ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.
చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్‌లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్