
పాన్ ఇండియా హీరోలు..స్టార్ డైరెక్టర్లు.. భారీ బడ్జెట్.. ఇవన్నీ ఉన్నా కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు రాలేకపోతున్న రోజులివి. స్టార్ హీరోల సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే కాస్తో కూస్తో జనాలు థియేటర్స్‌కి వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యానిమేషన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అదే ‘మహావతార్ నరసింహా’.
బడా చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటే.. ఈ మూవీ మాత్రం ఐదు వారాలుగా థియేటర్స్‌లో సందడి చేస్తూనే ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా తీసే క్రమంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.
దేవుడిని నమ్మేవాడిని కాదు..
మాది మహారాష్ట్ర. చదువుకునే రోజుల్లో దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడే ఉంటే..కొందరికి కష్టాలు, కొందరికి సుఖాలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించేవాడిని. అయితే కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు రావడంతో కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలు, భగవద్గీతా చదివాను. దీంతో నేను కృష్ణ భక్తిడిగా మారిపోయా. అప్పుడే వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించి త్రీడీలో ప్రహ్లాదుడు-నరసింహా స్వామి కథను తీయాలనుకున్నా. దాదాపు ఐదేళ్ల క్రితం మహావతార్ నరసింహ కథకి బీజం పడింది.
ఆస్తులన్నీ అమ్ముకున్నాం..
ఈ సినిమా కోసం మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం. మొదట్లో మా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిదంతా కొన్నాళ్లకే అయిపోయింది. నా భార్య దగ్గర ఉన్న డబ్బులు కూడా ఈ సినిమాకే ఖర్చు చేశాం. బడ్జెట్ ఊహించనంత పెరిగిపోయింది. ఇన్వెస్టర్లను వెతికాం. కొంతమంది పెట్టుబడి పెడతామని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. అలా దాదాపు వంద మందికి పైగా నిర్మాతలను, ఇన్వెస్టర్లను కలిశాం. చివరకు నా భార్య నగలు, కారు, ఇష్టంగా కట్టుకున్న ఇళ్లు కూడా అమ్మేసి సినిమా నిర్మాణానికి ఖర్చు చేశాం.
ఎవరు చూస్తారంటూ భయపెట్టారు
సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టపడింది. రోజుకు 16 గంటలు పని చేసేవాళ్లం. నెలాఖరు రాగానే టీమ్ జీతాల కోసం ఎక్కడ అప్పులు తేవాలని నా భార్య ఆలోచించేంది. ఇలా మా అవస్థలేవో మేం పడుతుంటే.. మరికొందరు ‘దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు? ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు.. సినిమా పోతే మీ పరిస్థితి ఏంటి? అని కొంతమంది భయపెట్టేవాళ్లు. కానీ నా భార్య, నేను ఒక్కటే అనుకున్నాం. ఒకవేళ సినిమా పోతే.. ‘అది మన ఖర్మ’ అనుకొని వదిలేసి.. గతంలో మాదిరి మళ్లీ వీఎఫ్‌ఎక్స్ పనులు చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నాం.
చాలా ఇబ్బందులు పడి జులై 25న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. రూ.40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ. 100 కోట్లను వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్ల వరకు రాబట్టింది. మా ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది’ అని అశ్వి కుమార్ అన్నారు.