యూట్యూబర్ దొరసాయి తేజ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'దందా'. ఛాయ్ షాట్స్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో దీన్ని తెరకెక్కించారు. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
అరవింద్ (దొర సాయి తేజ) బీటెక్ స్టూడెంట్. డబ్బు, అధికారంపై బలమైన కోరిక ఉంటుంది. తరగతి గదిలో కంటే హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే తన తెలివితేటలకు గుర్తింపు దక్కుతుందని అనుకుంటాడు. చిన్న చిన్న ఆన్‌లైన్ మోసాలతో ప్రారంభమైన ఇతడి ప్రయాణం.. ఫిషింగ్ స్కామ్‌లు, కాల్ సెంటర్లు, బ్లాక్‌మెయిల్స్, గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వరకు వెళ్తుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌ని శాసించే స్థాయికి అరవింద్ ఎలా ఎదిగాడనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
'చాయ్ షాట్స్' వేదికగా వచ్చిన తెలుగు మైక్రో సిరీస్ ఇది. ఒక్కోటి రెండున్నర నిమిషాలతో 29 ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ తీశారు. యుట్యూబ్‌లో పలు సిరీస్‌లతో ఆకట్టుకున్న దొరసాయి తేజ.. ఇందులో అరవింద్ పాత్రలో అలరించాడు. సక్సెస్ కోసం ఎంతటి అన్యాయానికైనా తెగించే ఒక రా అండ్ రఫ్ నెగిటివ్ హీరోగా బాగా చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మేకింగ్ కూడా బాగుంది. డైలాగ్స్, నటీనటుల నుంచి నటన రాబట్టడం, రిషి ఎం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అశ్విన్ లెనిన్ విజువల్స్ ఈ సిరీస్ కి ప్రాణం పోశాయి. అరవింద్ పాత్రకు పోటీ ఇచ్చే ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న ఆకట్టుకున్నాడు. రెండో సీజన్‌పై ఆసక్తిని పెంచేలా ఆయన పాత్ర సాగుతుంది.


