శాండల్‌వుడ్ హీరో దర్శన్(Darshan Thoogudeepa) కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో రెండోసారి అరెస్టైన దర్శన్ ప్రస్తుతం జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చాలాసార్లు విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. కానీ దర్శన్ అడిగిన సౌకర్యాలు ఇవ్వడం సాధ్య కాదని.. అందులో కొన్ని మాత్రమే ఇవ్వగలమని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్‌పై వేయగా.. తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. జైలులో దర్శన్‌కు కనీస సదుపాయాలు కల్పించడం లేదని వివరించారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేసి.. ఏ శిక్ష విధించినా దర్శన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. త్వరగా విచారణ జరిపి.. మరణశిక్ష విధించినా సరే తమకు సమ్మతమేనని దర్శన్ తరఫు న్యాయవాది వాదించారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. గతంలో తనకు విషమిస్తే ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయవాది గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసి తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న దర్శన్‌కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ పిటిషన్ దాఖలు చేశారు.


