
మరో రెండు రోజుల్లో రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఎవరెంత చెప్పినా సరే ఇవి స్ట్రెయిట్ మూవీస్ కావు. కాకపోతే రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ పుణ్యమా అని 'కూలీ' చిత్రానికి.. తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ అని 'వార్ 2'కి తెలుగులో రాష్ట్రాల్లో మంచి హైప్ ఉంది. అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే లేదు. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి సంగతి?
'కూలీ' సినిమాకు చెన్నైలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో ఈ మూవీ టికెట్ గరిష్ఠ ధర రూ.183 నిర్ణయించారు. కానీ హైదరాబాద్‌లో ఇదే గ్రూప్ మల్టీప్లెక్స్‌లో రూ.350 నుంచి రూ.453 మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో జీవో రాబోతుంది. 'కూలీ'కి మాత్రమే కాదు 'వార్ 2'కి కూడా దాదాపు ఇదే ధరలు ఉండనున్నాయి. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గర రిలీజయ్యే డబ్బింగ్ వెర్షన్‌కే ఎందుకింత ఎక్కువ టికెట్ రేట్లు?
(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)
తెలుగు ప్రేక్షకులు.. ఏ భాష సినిమా అయినా సరే బాగుంటే చాలు చూసేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ఈ విషయాన్ని గ్రాంటెడ్ తీసుకుంటే.. రాబోయే రోజుల్లో నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే 'బంగారు బాతు గుడ్డు' కథ మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పటితో పోలిస్తే చాలా తగ్గించేశారు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డుకాలం గ్యారంటీ!
ప్రేక్షకుడు ఎప్పుడూ కోరుకునేది ఒకటే. సినిమా బాగుండాలి. టికెట్ ధరలు అందుబాటులో ఉండాలి. నిర్మాతలు ఈ విషయం గుర్తుంచుకుని.. అందుకు తగ్గ మూవీస్ తీస్తే చాలు. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా కాదని వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలని ఆశపడితే ప్రస్తుతానికి పర్లేదు కానీ రాబోయే రోజుల్లో అంతే సంగతులు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)