Mukku Avinash: చచ్చిపోదామనుకున్న అవినాష్‌.. రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకున్న శ్రీముఖి

Comedian Mukku Ajay About Mukku Avinash Struggles - Sakshi

ముక్కు అవినాశ్‌.. జబర్దస్త్‌ కామెడీ షోతో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాడు. తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని మెరిశాడు. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే వెనకేసిన అవినాష్‌ ఒకానొక సమయంలో మాత్రం తినడానికి తిండి లేక అలమటించాడు. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు అవినాష్‌ సోదరుడు అజయ్‌.

చికెన్‌ కూడా వద్దన్నాడు!
అతడు మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్‌లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఇల్లు, కారు తీసుకున్నాం. ఈ రెండు ఈఎమ్‌ఐలతో పాటు బయట చిన్నపాటి అప్పులు కూడా ఉండేవి. ఈఎమ్‌ఐలు కట్టకపోవడంతో నోటీసులు వచ్చాయి. మరోవైపు షూటింగ్స్‌ ఆగిపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో అన్న మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు సరదాగా చికెన్‌ వండుకుందాం అని అడిగాను. మన పరిస్థితే బాలేదు, రోజూ పప్పు తింటున్నాం కదా.. ఇప్పుడు కూడా అదే తిందాం.. చికెన్‌ అవసరమా? అన్నాడు. అలాంటి రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి.

వాళ్ల సాయంతోనే..
అన్న ఒక రూమ్‌లో, నేను ఇంకో రూమ్‌లో నిద్రించేవాళ్లం. అన్న ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉదయం 5 గంటల వరకు పడుకునేవాడే కాదు. ఈ అప్పులు, ఒత్తిళ్ల వల్ల ఒకానొక సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది! బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు తాను చనిపోదామనుకున్న విషయాన్ని నాతో చెప్పాడు. అప్పుడు అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి! అన్న జేబులో రూపాయి లేదు. ఆ సమయంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడంతో ఒప్పుకున్నాడు. జబర్దస్త్‌కు రూ.10 లక్షలు ఇచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చాడు. శ్రీముఖి రూ.5 లక్షలు, గెటప్‌ శ్రీను రూ.1 లక్ష, చమ్మక్‌ చంద్ర రూ.2 లక్షలు.. ఇలా అందరి దగ్గరా అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చేశాడు. దేవుడి దయ వల్ల బిగ్‌బాస్‌ తర్వాత తన కెరీర్‌ ఇంకా బాగుంది' అని చెప్పాడు అజయ్‌.

బిగ్‌బాస్‌ హౌస్‌లో కష్టాలు చెప్పుకున్న అవినాష్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ లాక్‌డౌన్‌లో తాను పడ్డ కష్టాలను చెప్పాడు అవినాష్‌. లాక్‌డౌన్‌లో ఇంటి ఈఎమ్ఐ క‌ట్ట‌లేక‌పోయానన్నాడు. ఎందుకంటే అదే స‌మ‌యంలో తండ్రికి గుండెపోటు రావడంతో మూడు స్టంట్లు వేయ‌డానికి ఇంటి కోసం ఉంచిన‌ రూ. 4 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టినట్లు తెలిపాడు. అలాగే అమ్మ‌కు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించినట్లు పేర్కొన్నాడు. అప్పుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు.

NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: నాగార్జున స్పెషల్‌ గిఫ్ట్‌.. ఆనందంలో తేలియాడుతున్న శోభ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top