ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్‌మీడియాలో స్పందించారు. ఉగాది నాడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై ఈ గౌరవాన్ని చిరు పొందారు. ఈ క్రమంలో ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు లభించడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన పంచుకున్నారు.
'చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే…N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా…ఆయన పోషించిన కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.'
మెగా హీరో రామ్‌చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డ్‌తో తన తండ్రిని గౌరవించడం తమ కుటుంబానికి అత్యంత గర్వకారణమైన క్షణమని అన్నారు. సినిమాపై ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రేమ, నిబద్ధత చాలామందికి స్ఫూర్తిదాయకమని చరణ్ అన్నారు. ఇండస్ట్రీలోని ప్రతిభను గుర్తించి అవార్డులతో గౌరవించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


