
టైటిల్ : బ్రొమాన్స్
నటీనటులు: మాథ్యూ థామస్, అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్ తదితరులు
దర్శకత్వం: అర్జున్ డి. జోస్
ఓటీటీ: సోనీ లివ్
ఓటీటీలు వచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించడం మరింత సులభతరం అయిపోయింది. ఏ కొత్త సినిమా వచ్చినా నెల రోజుల్లోపే ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నారు. ఓటీటీలు రావడంతో కంటెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. కంటెంట్ బాగుంటే ఏ మూవీనైనా ఆడియన్స్ వదలడం లేదు. ఏ భాషలో వచ్చినా కథ బాగుంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఇక మలయాళ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రైమ్, కామెడీ జోనర్ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అలాంటి జోనర్‌లో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మలయాళ సినిమా బ్రొమాన్స్. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన బ్రొమాన్స్.. సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
షింటో (శ్యామ్ మోహన్), బింటో (మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. అమ్మా, నాన్నతో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ప్రతి విషయంలో అన్నతో తమ్ముడు బింటోను పోలుస్తూ ఉంటారు. ఇది నచ్చని బింటో అన్న అంటే అంతగా ఇష్టముండదు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు చిల్ అవుతూ ఉంటారు. బింటో ఎప్పుడు రీల్స్ పిచ్చిలో పడి లైఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఊహించని విధంగా బింటో అన్న షింటో మిస్సింగ్ అవుతాడు. ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం లేని అన్న కోసం తమ్ముడు ఏం చేశాడు? చివరికీ అన్న షింటోను కనిపెట్టాడా? లేదా? అన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
సాధారణంగా అన్నదమ్ముల స్టోరీ అనగానే సగటు ఆడియన్స్ ఎమోషనల్ డ్రామా అనుకుంటే పొరపాటే. కథ ప్రారంభంలో ఫ్యామిలీ లైఫ్, అన్నదమ్ముల అనుబంధం చూడగానే ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ఏంటంటే.. ఎమోషనల్ టచ్ ఇచ్చి.. కామెడీ పండించాడు. ఒకవైపు అన్న అంటే పడని తమ్ముడు.. అతను మిస్సింగ్ అయ్యాడని తెలిశాక జరిగే పరిణామాలు అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఆ తర్వాత అన్న కోసం ఆరా తీసే క్రమంలో షింటో స్నేహితుడు షబీర్ (అర్జున్ అశోకన్) బింటోకు సాయం చేస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరికీ డాక్టర్ ఐశ్వర్య, ఎస్సై టోనీ నుంచి ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతాయి. ఈ సన్నివేశాలు సీరియస్‌గా అనిపించినా.. ప్రతి సీన్‌లో కామెడీ పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
అన్నదమ్ముల సెంటిమెంట్ అనే లైన్ తీసుకున్న డైరెక్టర్.. కథను పూర్తిగా కామెడీ యాంగిల్‌లోనే తీసుకెళ్లాడు. అన్న కోసం వెతుకుతున్న బింటో.. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ సాయం తీసుకుంటాడు వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌ను తెగ నవ్విస్తాయి. అలా బింటో అన్న కోసం వెతుకున్న టీమ్‌లో కీలక మెంబర్ పాత్ర పోషిస్తాడు. తన అన్నను ఏమైనా అంటే విపరీతమైన కోపంతో ఊగిపోయే బింటోకు కొరియర్ బాబు రూపంలో గట్టి షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఎస్సై ఎంట్రీ ఇవ్వడంతో కథ కామెడీతో పాటు ఆసక్తికరంగా మారుతుంది. కేరళలో మొదలైన కథ.. కర్ణాటకకు షిప్ట్ అయ్యాక కథలో వచ్చే సీన్స్ ఆడియన్స్‌లో నవ్వులు పూయిస్తాయి. ప్రతి సీన్‌లో కామెడీని ఇరికించే ప్రయత్నం చేశాడు.
ఎమోషనల్‌కు ముడిపెట్టి ఫుల్ కామెడీ వైపు నడిపించిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే కేవలం కామెడీపైనే దృష్టి పెట్టడంతో సగటు ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ టచ్ మిస్సయింది. ఆ విషయంలో డి జోస్ మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే అక్కడ కూడా సీరియస్‌నెస్ ఉన్నప్పటికీ.. ఫైట్ సీన్ ఆద్యంతం నవ్వులు తెప్పించాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ టచ్ ఇచ్చినా.. అంతగా ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో భావోద్వేగాలు పండించలేకపోయాడు. చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చి.. నవ్విస్తూనే ఎండ్ కార్డ్ పడేశాడు. ఓవరాల్‌గా చూస్తే సీరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో ఫుల్‌గా నవ్వుకోవాలంటే..ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అభ్యంతరకర సన్నివేశాలు లేనందున ఫ్యామిలీతో చూసేయొచ్చు.
ఎవరెలా చేశారంటే...
ప్రేమలు మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మాథ్యు థామస్ తన పాత్రలో మెప్పించాడు. షింటోగా శ్యామ్ మోహన్ తన పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్‌గా సంగీత్ ప్రతాప్ పాత్ర కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. అర్జున్ అశోకన్, మహిమా నంబియార్, శ్యామ్ మోహన్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. గోవింద్ వసంత నేపథ్య సంగీతం బాగుంది. అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. చామన్ చాకో కొన్ని అనవసర సీన్స్‌ను కట్ చేయాల్సింది. నిర్మాణ విలువల పరంగా ఫర్వాలేదపించారు.