
గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన 'మీట్ ది పీపుల్' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.
విజయ్‌ను అరెస్ట్ చేయాలి
ఇంతటి విషాదానికి కారణమైన విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ ఓవియా (Oviya) డిమాండ్ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్ విజయ్' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనిపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్‌ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను గంటల వ్యవధిలోనే డిలీట్ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.
బిగ్‌బాస్, సినిమా
కేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్ చేసింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా రియాక్టైంది.