కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ పెడుతున్నారు.
సరిగా నిద్రుండేది కాదు
ఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు హితేన్ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్‌ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.
ఛాన్స్ దొరికితే నేలపై నిద్ర
పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్‌తో నెక్స్ట్ షిఫ్ట్ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్ నచ్చక చాలామంది డ్రైవర్స్ సడన్‌గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్‌ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.
సీరియల్స్
హితేన్.. సుకన్య, ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతన్ కభీ సహేలి సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్ సీరియల్‌తో బ్రేక్ అందుకున్నాడు. క్యూంకీ సాస్ భీ కభీ బహుతీ, కుసుమ్, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు తీ 2 సీరియల్ చేస్తున్నాడు. హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు.
చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!


