పచ్చళ్ల వ్యాపారంతో అక్క అలేఖ్య ఫేమస్ అయితే.. ఫిట్‌నెస్ వీడియోలతో చెల్లి రమ్య పాపులర్ అయింది. పైగా వర్కవుట్స్ అంటూ గ్లామర్ వీడియోలు షేర్ చేయడంతో ఓ పక్క తిడుతూనే ఆమెను ఫాలో అయ్యారు చాలామంది. సోషల్ మీడియాలో విపరీతైమన నెగిటివిటీ తెచ్చుకున్న రమ్యకు బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చింది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా.. వచ్చేస్తున్నా అంటూ వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ రెండువారాల్లోనే ఎలిమినేట్ అయింది. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం..
నో ట్రాక్స్
బిగ్‌బాస్ హౌస్‌లో బంధాలు పెట్టుకోవడానికి రాలేదంది రమ్య. అన్నట్లుగానే ఫేక్ రిలేషన్స్, లవ్ ట్రాకుల జోలికి వెళ్లలేదు. కానీ ఇది ఒకరకంగా ఆమెకు మైనసే అయింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న సంజనా సేవ్ అవడానికి కారణం.. ఇమ్మాన్యుయేల్‌తో తనకున్న బంధమే! ఇమ్మూ నామినేషన్స్‌లో లేడు కాబట్టి అతడి ఓట్లన్నీ ఆమెకు వేశారు. అలా సంజనా సేవ్ అయింది.
అదే ముఖ్య కారణం
రమ్య (Ramya Moksha) ఎలిమినేషన్‌కు ఆమె స్వయంకృతాపరాధం ముఖ్య కారణం. తను వచ్చీరావడంతో కుంభస్థలాన్ని కొట్టాలనుకుంది. తనూజ, కల్యాణ్‌లపై నోటికొచ్చినట్లు మాట్లాడింది. తనపై కల్యాణ్ చెయ్యేస్తే కిందపడేసి తొక్కుతానంది. తనూజను స్ట్రాంగ్ పాయింట్స్‌తో నామినేట్ చేసింది. కానీ చెప్పే విధానం సరిగా లేదు, హద్దులు దాటి మాట్లాడటంతో అది తనూజకే ప్లస్ అయింది. పైగా ఓసారి.. పక్కకెళ్లి ఆడుకోపో అని తనూజకు టిష్యూ పేపర్‌పై రాసివ్వడం చూసేవారికి కాస్త ఓవర్‌గా అనిపించింది.

అది మర్చిపోతే ఎలా?
తనూజ (Thanuja Puttaswamy) ఎలిమినేషనే టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ, తనూజను కిందకు లాగాలంటే ముందు తాను హౌస్‌లో ఉండాలన్న విషయం మర్చిపోయింది. ఇప్పటికే బయటున్న నెగెటివిటీ చాలదన్నట్లు తనూజ- కల్యాణ్‌లపై నోరు జారడం.. దాన్ని నాగార్జున తప్పుపట్టినా మరేం పర్లేదన్నట్లుగా ప్రవర్తించడం, హైపర్ ఆది వచ్చినప్పుడు కూడా కాస్త యాటిట్యూడ్ చూపించడంతో విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. గేమ్‌పై కన్నా తనూజపైనే ఎక్కువ ఫోకస్ చేసి.. ఆమెను ఢీ కొట్టాలని చూసి బొక్కబోర్లాపడింది.
రెమ్యునరేషన్
ఇలా పదేపదే తనూజను టార్గెట్ చేయడం ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇంకేముంది, నామినేషన్స్‌లో ఎవరు బలహీనంగా ఉంటారో వారికి ఓట్లు గుద్ది.. రమ్యను డేంజర్ జోన్‌లో పడేశారు. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో పెద్దగా కనిపించలేదు. దీంతో రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఆమెకు వారానికి రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకుగానూ దాదాపు రూ.4 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
చదవండి: కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య


