
బిగ్‌బాస్ 9.. ఈసారి డబల్ హౌస్ అంటూ ఊదరగొట్టారు. ఇదేదో కొత్త కాన్సెప్ట్‌లా ఉందే అని అందరూ తెగ ఎగ్జైట్ అయ్యారు. పైగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అనగానే బుల్లితెర ప్రేక్షకులు ఈసారి షో హిట్టవడం ఖాయం అని ముందుగానే ఫిక్సయిపోయారు. కానీ కంటెస్టెంట్ల ఎంపిక చూశాక నీరసించారు, అయినా అగ్నిపరీక్ష నెగ్గొచ్చిన కామనర్లున్నారుగా.. వాళ్లు ఆటతో రఫ్ఫాడిస్తారులే అనుకున్నారు.
విసుగు తెప్పిస్తున్న కామనర్లు
కట్ చేస్తే రఫ్ఫాడించడం దేవుడెరుగు.. షో చూడాలంటేనే విసుగొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌కు ఓనర్లు అన్నందుకు నిజంగానే యజమానుల్లా ఫీలైపోతున్నారు. సెలబ్రిటీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చాలు గొడవలకు సై అంటూ నోరేసుకుని మీద పడిపోతున్నారు. వాళ్ల ఓవరాక్షన్‌తో ప్రేక్షకులకు షో చూడాలంటేనే విసుగు పుడుతోంది. దీంతో ఆ వైల్డ్ కార్డులు ఎప్పుడొస్తాయా? అని జనం ఎదురు చూస్తున్నారు.
కెప్టెన్సీకి ఎవరు అనర్హులు?
నిన్న (సెప్టెంబర్ 18) ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఓనర్లలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులు? ఎవరు అర్హులో చెప్పాలని టెనెంట్లను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో వాళ్లు ప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, హరీశ్‌ను అనర్హులుగా తేల్చారు. దాంతో వాళ్లు కాసేపు గొడవపడ్డారు. ఇక అర్హులుగా భరణి, మనీష్, డిమాన్ పవన్ (Demon Pavan)ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురూ టెనెంట్స్‌లో ఒకరిని కెప్టెన్సీ కంటెండర్‌గా సెలక్ట్ చేయాలన్నారు.

రీతూ కోరిక పవన్ కాదంటాడా?
దాంతో వాళ్లు పెద్దగా చర్చలు పెట్టకుండా ఏకాభిప్రాయంతో ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పారు. అలా భరణి, మనీష్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ రంగుపడుద్ది అనే టాస్క్‌లో పాల్గొన్నారు. అయితే దీనికంటే ముందు.. ఓ ఆసక్తికర చర్చ జరిగింది. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలని రీతూ (Rithu Chowdary) కోరడం.. నీకోసం ట్రై చేస్తా అని డిమాన్ పవన్ కళ్లలోకి కళ్లు పెట్టి మాటివ్వడం జరిగింది. మీ కోరికకు నేనెందుకు కాదంటాను అనుకున్నాడో ఏమో కానీ బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌కు రీతూను సంచాలక్‌గా పెట్టాడు.
మొదట టార్గెట్ చేసిందెవరు?
ఇంకేముంది, గేమ్‌ను తనకు నచ్చినట్లు మార్చేసింది. మొదటి రౌండ్‌లో మనీష్.. భరణిని టార్గెట్ చేసి అతడి ప్లేటు కింద పడేశాడు. దీంతో భరణి మనీష్‌కు రంగు పూశాడు. అలా మనీష్ ఔట్ అయ్యాడు. రెండో రౌండ్‌లో భరణి, ఇమ్మూ కలిసి డిమాన్‌ను టార్గెట్ చేశారు. దీంతో కామనర్స్.. కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్లే టాస్క్ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారంటూ అరిచారు. ఈ గేమ్‌లో డిమాన్ ఔటవ్వాల్సింది. కానీ రీతూ అలా ఎలా చేస్తుంది? తాను ఆపమన్నా సరే, భరణి మూడుసార్లు పక్కవాళ్లపై రంగు పూశాడంటూ అతడిని గేమ్ నుంచి తీసేసింది. తర్వాతి రౌండ్‌లో ఇమ్మాన్యుయేల్ పోరాడి ఓడిపోయాడు. దీంతో విన్నర్ డిమాన్ పవన్.. హౌస్‌లో రెండో కెప్టెన్‌గా నిలిచాడు.