
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్ పాప.. సాంగ్‌తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది.
రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్‌బాస్ 9 షోలో అడుగుపెట్టింది.
అసలేం జరిగిందంటే?
20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్‌గానూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది.