కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి సందడి చేసేందుకు వచ్చేస్తున్నారు. ఈసారి బ్యాండ్‌మేళం మూవీలో వీరు బావామరదళ్లుగా నటించారు. సతీశ్ జవ్వాజి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం (మార్చి 24న) ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత బండ్ల గణేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
అరడజను మంచి డైరెక్టర్లకు ఛాన్స్
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కోన వెంకట్‌గారికోసమే ఈ ఈవెంట్‌కు వచ్చాను. ఇండస్ట్రీ మొత్తం ఒక పక్కనుంటే, కోన ఒక్కడే నీ పక్కనుంటే నువ్వు గెలిచేయొచ్చని వినాయక్ అన్నాడు. అది ఆయనకున్న పవర్.. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలను ఒప్పించి అరడజను మంది దర్శకులకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం అంటే జోక్ కాదు. హీరోలు 100 ప్రశ్నలు వేస్తారు, 200 డౌట్లు పడతారు.
చస్తే ఆ పని చేయను
ఎందుకంటే వాళ్లకు హిట్టు కావాలి! అలాంటి వాళ్లను ఎలాగోలా మాయ చేసి ఒప్పిస్తున్నారు. బాబీ, గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ శివ నిర్వాణ.. ఇలా ఎంతోమందిని డైరెక్టర్ల ముందడుగు కారణమై సక్సెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కోన వెంకట్ ముందుంటాడు. బ్యాండ్‌మేళం కోసం ఆయన రెండు, మూడు ప్రాపర్టీలు అమ్మేశాడు. నేనయితే ప్రాణం పోయినా ఆ పని చేయను. ఆస్తి తాకట్టు పెట్టి సినిమా తీశారంటే మీకు సినిమా అంటే అంత ప్రేమ.
సక్సెస్ మన చేతుల్లో లేదు
హీరో హర్ష్ రోషన్ విషయానికి వస్తే.. టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. ఎవరైనా ఇండస్ట్రీకి రావొచ్చు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా అరుదు. మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లాంటివారికి జరిగింది. స్టార్ డైరెక్టర్స్.. తమ కుమారులకు వారసత్వంగా ఆస్తినిచ్చారు, కానీ సక్సెస్ ఇవ్వలేదు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. నిజంగా రోషన్‌ను చూస్తే నా కొడుకుగా పుట్టుంటే బాగుండేదనుకున్నాను. ఈ అబ్బాయి సూపర్‌స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ కోన వెంకట్‌గారికోసమైనా సూపర్ హిట్ అవుతుంది అని బండ్ల గణేశ్ జోస్యం చెప్పాడు.


