ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు | Asha Bhosle Funeral Held by Maharashtra govt honors | Sakshi
Sakshi News home page

ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు

Apr 14 2026 6:54 AM | Updated on Apr 14 2026 8:27 AM

Asha Bhosle Funeral Held by Maharashtra govt honors

భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్‌ ఆశా భోంస్లే అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలోని లోయర్‌ పారెల్‌లోని ఆమె నివాసంలో ఉంచారు. 

మహారాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే, మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ శిండే, క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, నటులు ఆమిర్‌ ఖాన్, రణ్‌వీర్‌ సింగ్, వివేక్‌ ఒబెరాయ్, విక్కీ కౌశల్,  సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్, ‘శివ సేన’ పార్టీ ఆధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే వంటి వారితో పాటు పలువురు సినిమా, పొలిటికల్, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆశా భోంస్లే నివాసం నుంచి దాదర్‌లోని శివాజీ ΄పార్క్‌ శ్మశాన  వాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆశా భోంస్లేని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘ఆశా భోంస్లే అమర్‌ రహే’ అనే నినాదాలతో, అశ్రునయనాల నడుమ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి ఆశా భోంస్లేకు కుమారుడు ఆనంద్‌ భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement