
‘‘నేను సినిమాల్లోకి భయం భయంగా వచ్చాను. అయితే రెండు దశాబ్దాల జర్నీ పూర్తి చేసుకున్నాను. ఇన్నేళ్ల ప్రయాణాన్ని ఊహించలేదు. ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని, స్టార్‌డమ్‌ని సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఇందుకు ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి కృతజ్ఞతతో ఉంటా’’ అని హీరోయిన్ అనుష్క శెట్టి చెప్పారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానున్న సందర్భంగా అనుష్క పంచుకున్న విశేషాలు.
→ ‘ఘాటీ’లో నేను చేసిన శీలావతి క్యారెక్టర్‌లో బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి. నా కంఫర్ట్ జోన్‌ని దాటి చేసిన సినిమా ఇది. శీలావతి నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. సరోజ (‘క్రిష్’ డైరెక్షన్‌లో చేసిన ‘వేదం’ సినిమాలోని పాత్ర), శీలావతి వంటి అద్భుతమైన పాత్రలు ఇస్తున్న క్రిష్‌గారికి థ్యాంక్స్.
→ క్రిష్‌గారు, చింతకింది శ్రీనివాస్‌గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లిన తర్వాత ఒక కొత్త పాత్ర, సంస్కృతి, ఒక కొత్త విజువల్‌ని ప్రేక్షకులకి చూపించబోతున్నామనే ఎగ్జయిట్‌మెంట్ కలిగింది. ప్రతి మహిళ సాధారణంగా, సున్నితంగా కనిపించినప్పటికీ ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన స్తంభంలాగా నిలబడుతుంది. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. ‘అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి’ వంటి సినిమాల్లో చాలా బలమైన పాత్రలు చేశాను. ‘ఘాటీ’లో చేసిన శీలావతి పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న ప్రధానమైన సమస్య గంజాయి. క్రిష్‌గారు సమాజానికి దగ్గరగా ఉండే కథలనే ఎంచుకుంటారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఘాటీ’లో చక్కని సందేశం కూడా ఉంది.
→ నేను చేసిన చాలా సినిమాలు కష్టంతో కూడుకున్నవే. ‘ఘాటీ’లోనూ ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. షూటింగ్ కోసం పెద్ద పెద్ద కొండలు ఎక్కేవాళ్లం. ఇలాంటి ఒక వైవిధ్యమైన కథని నమ్మి, నాపై నమ్మకం ఉంచి ఇంత గ్రాండ్ స్కేల్‌లో ఈ సినిమా చేసినందుకు రాజీవ్ రెడ్డి, సాయిబాబుగార్లకు, యూవీ క్రియేషన్స్‌వారికి ధన్యవాదాలు. క్రిష్‌గారు రాసిన మూడు ΄ాటల్లో ‘కుందేటి చుక్క...’ అంటూ ఆయన చేసిన పదప్రయోగం నాకు చాలా ఇష్టం. షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను... పుస్తకాలు చదువుతాను... సినిమాలు చూస్తాను. ప్రస్తుతం క్రిష్‌గారు ఇచ్చిన ‘మహాభారతం’ చదువుతున్నాను. రెండేళ్లుగా ఎక్కువగా కుటుంబంతోనే సమయం గడుపుతున్నాను.
→‘ఘాటీ’ని ఆంధ్ర–ఒరిస్సా సరిహద్దుల్లో షూట్ చేసినప్పుడు నన్ను చూడడానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రావడం హ్యాపీగా అనిపించింది. రాజమౌళిగారు లాంటి దర్శకుడు ‘బాహుబలి’ లాంటి చిత్రాలని అద్భుతంగా తీయడం వల్లే అన్ని వైపులా రీచ్ అయింది. మంచి సినిమా చేస్తే ప్రపంచం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నాను. నేను ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ నన్ను ‘అరుంధతి’గానే గుర్తుపడుతున్నారు.
→ ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తిగా ఉంది. ‘ఛత్రపతి’ సినిమా సమయం నుంచి ప్రభాస్‌తో నాకు మంచి స్నేహం ఉంది. మేము కలిసి నటించిన సినిమాల్లో మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటే అది ఆయా ΄ాత్రల గొప్పదనం. ఇక బలమైన కథ కుదిరితే ఔట్ అండ్ ఔట్ నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. మొదటిసారి మలయాళంలో ‘కథ నార్’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది.