'ధురంధర్' సినిమాతో హీరో రణ్‌వీర్ సింగ్ పేరు మారుమోగిపోతోంది. అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం, నటన గురించి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. అయితే అతడు మొదటినుంచి అంతే డెడికేషన్‌తో పని చేసేవాడంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్. రణ్‌వీర్ సింగ్ హీరోగా, అనురాగ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం లూటేరా. ఇది రణ్‌వీర్ నటించిన మూడో చిత్రం. అనురాగ్ సినిమా నిర్మించడంతో పాటు డైలాగ్స్ అందించాడు.
రణ్‌వీర్ ఎప్పుడూ ఇంతే..
ఆ మూవీ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అనురాగ్ కశ్యప్. ఆయన మాట్లాడుతూ.. 'ధురంధర్ మూవీకోసం రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ ఎంత కష్టపడ్డారు? ఎన్ని గాయాలు తగిలించుకున్నారు? అని మనమంతా మాట్లాడుకుంటున్నాం. తమ పాత్రలకు న్యాయం చేయడం కోసం వాళ్లు ఎంతదూరమైనా వెళ్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమా కూడా అద్భుతంగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కానీ రణ్‌వీర్ సింగ్ ఇప్పుడే కాదు, మొదటినుంచి కూడా ఇలాగే ఉండేవాడు. తన కెరీర్ మొదట్లో చేసిన లూటేరా సినిమా గురించి చెప్తాను.
గాయం చేసుకుని
ఈ మూవీ క్లైమాక్స్‌లో రణ్‌వీర్‌పై కాల్పులు జరుగుతాయి. ఆ నొప్పి అనుభవించడం కోసం అతడు తన పొట్టపై గాయం చేసుకున్నాడు. కనీసం మాకెవరికీ ఒక మాటైనా చెప్పలేదు. సహజత్వం కోసం అంతగా తపించాడు. నొప్పితో బాధపడుతున్నా సరే మాతో పంచుకోలేదు. చివరకు అతడు కదల్లేని స్థితిలో ఉండటంతో ఏమైందని చూడగా పొట్టపై గాయం ఉంది. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. అదీ అతడికి సినిమా పట్ల ఉన్న అంకితభావం! కానీ ఆ మూవీ ధురంధర్‌లా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. మొదటి భాగం 2025 డిసెంబర్‌లో విడుదలవగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో భాగం ఈ ఏడాది మార్చి 19న రిలీజవగా ఇప్పటివరకు రూ.1600 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
చదవండి: లావుగా ఉందని నా భార్యపై ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే: విశ్వ


