నటుడు విశ్వ సీరియల్స్‌లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్‌నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్‌గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను.
తొక్కేశారు
కొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.
నా అభిమాని
శ్రద్ధతో తన లవ్‌స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ట్రోల్స్
ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్‌నెస్ క్లబ్‌లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్‌సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.
ఆ వ్యాధి వల్లే..
అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్‌సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్‌సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.


