దర్శకుడిగా వరుస బ్లాక్‌బస్టర్లు కొడుతున్న అనిల్ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్ సినిమాపై అప్‌డేట్ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది.
సరైన నిర్ణయం తీసుకోకపోతే
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్ ఇచ్చాను.
టైటిలే విచిత్రంగా ఉండబోతోంది
తాజాగా వైజాగ్ టూర్‌లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే జరగబోతోంది. టైటిల్ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్ ప్రకటిస్తాను.
పవన్ కల్యాణ్‌తో కాదు!
ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్ మాత్రమే ఫిక్స్ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్ దరకడం కదా! జూన్, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.
చదవండి: పెళ్లి ప్రపోజల్.. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్: హీరోయిన్


