
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 650 మంది స్టంట్‌మ్యాన్‌ల కుటుంబాలకు అండగా నిలిచారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్లో స్టంట్‌మ్యాన్ రాజు (52) మృతి చెందిన విషయం తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్ (pa ranjith) తెరకెక్కిస్తున్న వేట్టువం సినిమాలో భాగంగా కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటు రావడం వల్ల మరణించారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత తాను చలించిపోయినట్లు నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు.
సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ స్టంట్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్ అన్నారు. వారి కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 'ఒక్కోసారి ప్రమాదం జరిగితే వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. అందువల్ల వారు వైద్య బీమాను భరించలేరు. ' అని ఆయన అన్నారు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమాను చెల్లించాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఆరోగ్య కవరేజ్తో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి కొంత డబ్బు కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందని చెప్పారు.