
ఒక్కోసారి సక్సెస్‌ఫుల్ నటి అని ముద్ర వేసుకున్నా అవకాశాలు ముఖం చాటేస్తుంటాయి. నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె 2019లో కన్నడ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.

అంతేకాకుండా గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇలా సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్ (ఈటీ), ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన 'సరిపోదా శనివారం' చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన 'జాబిలమ్మా నీకు అంత కోపమా' చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు.
తెలుగులోనూ ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దీంతో మడి కట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని గ్రహించారో ఏమోగానీ గ్లామర్‌కు తెర రేపింది. తాజాగా వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు చోటు చేసుకున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ప్రియాంకమోహన్ అవకాశాల వేట మొదలుపెట్టారన్నమాట.