
‘‘హాస్యనటులు హీరోగా మారితే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. అయితే నన్ను నేను హీరోగా భావిస్తే అలాంటి భావన ఇతరుల్లోనూ వస్తుంది. కానీ, ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రంలో నేను లీడ్ రోల్ చేశాననే భావనతో ఉన్నాను. అందుకే ప్రస్తుతం ‘విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార’ వంటి చిత్రాలతో నటుడిగా బిజీగా ఉన్నాను’’ అని ప్రవీణ్ అన్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్ చేశారు. లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం ఐదుగురు బ్యాచిలర్స్ పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో వినోదం, భావోద్వేగం ఉంటాయి. ఇకపైనా అన్ని రకాల పాత్రలు చేస్తాను. అయితే లీడ్ రోల్ చేయాలంటే పూర్తి వినోదాత్మక కథ ఉండాలి. ఎందుకంటే నాలాంటి కమెడియన్స్ నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు’’ అని తెలిపారు.