దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్‌కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
రియల్ ధురంధర్ ఆయనే..
రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్‌గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.
భారత్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్‌లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.
23 ఏళ్ల వయసులోనే..
రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.
అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్‌ను కలవాల్సిన ముల్తాన్‌లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్‌ను సియాల్‌కోట్‌లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్‌వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్‌వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.

రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే?
రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్‌లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.
అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడు.


