ఆ తరువాత ధాన్యాన్ని మరో మిల్లుకు లేదా గోదాముకు షిఫ్ట్
15
రోజులే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రైసుమిల్లులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు..క్రిమినల్ కేసుల నమోదు..డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తుల స్వాధీనం..ఇలా సీఎంఆర్ బకాయిల వసూళ్లకు ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం..ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సీజనులో సీఎంఆర్ నిబంధనలను మరింత కఠినం చేసింది. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకున్న రైసుమిల్లర్లు సీఎంఆర్ బియ్యం డెలివరీ చేసేందుకు గడువు 15 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఈ గడువు మూడు నెలలు ఉండేది. అయితే రూ.వందల కోట్లు విలువ చేసే ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని సర్కారుకు అప్పగించకుండా ఆ ధాన్యాన్ని ప్రైవేటుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న విషయం విదితమే. దీంతో ఒక్కో జిల్లాలో సీఎంఆర్ బకాయిలు రూ.వేల కోట్లకు పెరిగిపోయాయి. కొత్త నిబంధన ప్రకారం ధాన్యం తీసుకున్న మిల్లర్లు 15 రోజుల్లో సీఎంఆర్ బియ్యం డెలివరీ ప్రక్రియను ప్రారంభించాలి. ఏమాత్రం జాప్యం చేసినా ఆ ధాన్యాన్ని వెంటనే ఆ మిల్లు నుంచి వేరే మిల్లుకు గానీ, బఫర్ గోదాములకు గానీ షిఫ్ట్ చేస్తారు. ఇలా 15 రోజుల్లో డెలివరీ ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చిన మిల్లర్లకే కేటాయింపులు ఉంటాయని పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్లకు స్పష్టం చేస్తున్నారు.
ముందస్తుగా గోదాములు లీజుకు
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు పేచీలు పెడితే రైతులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. హత్నూర మండలంలో సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదామును ముందస్తు ఏర్పాట్లలో భాగంగా లీజుకు తీసుకుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు ఈ గోదాముల్లో నిల్వ చేసేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ గోదాముల నిర్వహణ బాధ్యతలను ఎస్‌డబ్ల్యూసీ (స్టేట్ వేర్‌హౌస్ కార్పోషన్)కు అప్పగించారు.
ఈ మేరకు అగ్రిమెంట్ చేసే మిల్లులకే ధాన్యం కేటాయింపులు
గతంలో మూడు నెలలు గడువు
ఈ సీజను నుంచి సీఎంఆర్ నిబంధనలు మరింత కఠినం
ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర, గుమ్మడిదల వంటి మండలాల్లో కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో ఈసారి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 1.60 లక్షల దొడ్డు రకాలు కాగా, 40 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు కొనుగోలు చేసేలా ఖరీఫ్ కొనుగోలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అయితే ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కరెంట్ కోతలు వివిధ కారణాలతో వరి పంటకు సరిగ్గా నీరు అందడం లేదు. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోతాయని అనుకుంటున్నారు. గతేడాది ఖరీఫ్ సీజనులో కొన్న ధాన్యంలో సుమారు 20% నుంచి 30% తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి సన్న ధాన్యం కొనుగోళ్లు రెట్టింపవుతాయని భావిస్తున్నారు. గతేడాది 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈసారి 40 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తున్నాయి. అయితే సన్న బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో మంచి రేటు ఉండటంతో రైతులు సన్న ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకే విక్రయించే అవకాశాలు లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు.
హత్నూర మండలంలో ముందుగా..


