దారికి అడ్డంగా కందకం | - | Sakshi
Sakshi News home page

దారికి అడ్డంగా కందకం

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

దారికి అడ్డంగా కందకం వన దుర్గమ్మ సేవలో గవర్నర్‌ పీఆర్‌ఓ ఆర్టీసీ డిపో తనిఖీ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు రోలర్‌ స్కేటింగ్‌ సెలెక్షన్స్‌కు ఏర్పాట్లు

నర్సాపూర్‌: సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం సాక్షిలో వచ్చిన ‘కరుగుతున్న గుట్టలు’ కథనానికి మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. పట్టణాన్ని ఆనుకుని ఉన్న 76 సర్వేనంబరులో గల ప్రభుత్వ భూమిలోని గుట్టపైకి వెళ్లేందుకు అక్రమార్కులు ఏర్పాటు చేసిన రోడ్డుకు అడ్డంగా కందకం తవ్వించినట్లు ఆర్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. కందకం తవ్వించడంతో గుట్ట పైకి వాహనాలు వెళ్లడానికి వీలుండదని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.

పాపన్నపేట(మెదక్‌): గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పీఆర్‌ఓ దశరథం మంగళవారం ఏడుపాయల దుర్గమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ వీరేశం, సిబ్బంది, ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మ అర్చన చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మెదక్‌ డీపీఆర్వో రామచంద్రరాజు, దేవ స్థాన సిబ్బంది సూర్య శ్రీనివాస్‌, మధుసుదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవి, రాజు, పాపాగౌడ్‌, వీరేశం, యాదగిరి పాల్గొన్నారు.

నర్సాపూర్‌: స్థానిక ఆర్టీసీ డిపోను ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన తనిఖీలలో డిపో నిర్వహణ, ఆయా రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ ఆర్‌ఎం బీవీ రావు ఉన్నారు. కాగా స్థానిక డిపో మేనేజర్‌ మధుసూదన్‌ డిపో నిర్వహణ వివరాలను ఆర్‌ఎంకు అందజేశారు. ఇదిలాఉండగా బుధవారం ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఖుస్రోషా ఖాన్‌ ఆర్‌టీసీ డిపోను తనిఖీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తనిఖీ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు మంగళవారం స్థానిక డిపోను తనిఖీ చేశారని తెలిసింది.

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణ శివారులో ఉన్న ఆద్యా హోటల్‌లో మంగళవారం రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈసందర్భంగా అధికారులు ఆహార నాణ్యతతోపాటు కిచెన్‌లో సరుకులను తనిఖీ చేశారు. కిచెన్‌, ఇతర చోట్ల పరిశుభ్రత విషయమై పరిశీలించారు. లైసెన్సును తనిఖీ చేసి నోటీసు జారీ చేశారు. నాసిరకం పదార్థాలు విక్రయించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఉమ్మడి మెదక్‌ జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా రోలర్‌ స్కేటింగ్‌ సెలెక్షన్‌లు ఈ నెల 24,25 తేదీల్లో బీహెచ్‌ఈఎల్‌ స్కేటింగ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విఠల్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సెలెక్షన్‌కు కావల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement