● డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత
● గవర్నర్ శివప్రతాప్ శుక్లా
మెదక్‌జోన్: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్య, క్రీడలు, దేశ సేవకోసం కృషిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజా ఉద్యమంలా రూపు దిద్దుకుంటోందన్నారు. మారక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి భేష్ అన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా విద్యార్థులను చైతన్య పరచటం అభినందనీయమన్నారు. పిల్లలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ నిషాతో సర్వం నాశనం అవుతుందన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ, యువత మత్తుకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలని కోరారు. అంతకు ముందు గవర్నర్‌తో పాటూ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రతిమా సింగ్‌లు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. గ్రామీణాభి వృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. రెడ్‌క్రాస్ సోసైటీ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు గవర్నర్‌ను కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


