దసరాకు కొత్త పింఛన్లు! | - | Sakshi
Sakshi News home page

దసరాకు కొత్త పింఛన్లు!

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

దసరా పండుగ ధమాకా గా కొత్త పింఛన్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 న ప్రారంభమైన చేయూత పింఛన్‌ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారంతో ముగియగా ఇప్పటి వరకు వివిధ విభాగాల క్రింద దాదాపుగా 12,356 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల చివరి నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్టోబర్‌ మొదటి వారంలో లబ్ధిదారులను ఎంపిక చేసి, దసరా నుంచి కొత్త పింఛన్‌లను ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

–పాపన్నపేట(మెదక్‌)

ఒంటరి మహిళల గుర్తింపుపై, కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ, ఇటీవల అర్హుల గుర్తింపు బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. కాగా, ఇప్పటికే జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందుతున్నవారు 1,05,579 లబ్ధిదారులు ఉండగా, వారికి ప్రతీ నెలా రూ. 23,97,56,912 మేర పింఛన్‌ జమవుతోంది.

వృద్ధాప్య పింఛన్లు లేనట్లేనా!

సుమారు నాలుగేళ్ల తర్వాత కొత్తగా చేయూత పింఛన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే వృద్ధాప్య పింఛన్లకు ద్వారాలు మూసి ఒంటరి మహిళలు, గీతకార్మికులు,చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్‌ బాధితుల దరఖాస్తులకు పచ్చ జెండా ఊపారు. ఆగస్టు 9న ప్రారంభించిన దరఖాస్తులు మొదట ఆ నెలాఖరు వరకు తీసుకోవాలని భావించినప్పటికీ ఈ నెల 15 వరకు గడువు పెంచారు. పింఛన్‌ ఫారాలకు నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలు జతపర్చాలన్న నిబంధన ఉండటంతో నిర్ణీత గడువు పెంచారు. ఈ మేరకు దాదాపుగా 12,356 దరఖాస్తులు వచ్చాయని, సర్వర్‌ ఇబ్బంది వల్ల వివిధ రకాల పింఛన్ల వివరాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.

ఒంటరి మహిళ గుర్తింపే సమస్య

ఒంటరి మహిళల గుర్తింపు మొదట సమస్యగా మారింది. నిబంధనల మేరకు గతంలో పెళ్లయి, విడాకులు పొందిన 18 యేళ్లు దాటిన వారికి, విడాకుల పత్రం, కోర్టు ఉత్తర్వులు ఉండాలి. ఏడాదికి పైగా ఒంటరిగా ఉన్నట్లు తహశీల్దార్‌ నుంచి విచారణ నివేదిక ఉండాలి. ఇలా కాకుండా గ్రామాల్లో అయితే 30 ఏళ్లు పట్టణాల్లో అయితే 35 ఏళ్లు దాటి పెళ్లి కాకుండా ఉన్న మహిళలను స్థానిక పంచాయతీ కార్యదర్శులు విచారణ జరిపి ధ్రువీకరిస్తే వారిని ఒంటరి మహిళలుగా గుర్తిస్తున్నారు. అయితే ఈ నెల 11న వచ్చిన జీఓ ప్రకారం ఒంటరి మహిళల గుర్తింపు బాధ్యతలు ఎంపీడిఓలకు అప్పగించారు. భర్త మరణించిన మహిళలు సంబంధిత ధ్రువపత్రం చూపాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు భర్త మరణిస్తే తహశీల్దార్లు, ఆర్డీఓలు సర్టిఫికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. రెండేళ్లు దాటితే కోర్టు నుంచి తెచ్చుకోవాలని నిబంధనలు ఉండటంతో బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై పాపన్నపేట ఎంపీడీఓ విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. మంగళవారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని అక్టోబర్‌ మొదటి వారం నాటికి అర్హుల ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు.

15 వరకు 12,356 దరఖాస్తులు

ఒంటరి మహిళలగుర్తింపుపై మల్లగుల్లాలు

ముగిసిన దరఖాస్తుల గడువు

పాత ిపింఛన్లు 1.05 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement