శిథిల బురుజుల దుమ్ము దులిపిన యువకులు
పాపన్నపేట(మెదక్): నిజాం రాజ్యంలో అతి పెద్ద రెండో సంస్థానం, రాజకీయ రణతంత్రాలకు పరిపాలనా దక్షతకు పెట్టింది పేరు పాపన్నపేట కోట. నిత్యం రాచకార్యాలతో కళకళలాడిన రాజ భవనాలు నిర్మానుష్యంగా మారాయి. శత్రు దుర్భేద్య కోటలు..శిథిలమయ్యాయి. వీటిని పట్టించుకునే పాలకులే కరువయ్యారు. దీంతో అలనాటి వైభవం కాలగర్భంలో కలసి పోయింది. కళ్లముందే కనుమరుగవుతున్న వారసత్వ సంపదకు పునరుజ్జీవం పోయాలనుకున్నారు పాపన్నపేట యువకులు. అనుకున్నదే తడువుగా నాడు నిజాం ప్రభువు చేత ‘రాయబగన్’(ఆడ సింహం) బిరుదు పొందిన రాణి శంకరమ్మ పేరిట ‘యూత్ అసోసియేషన్’ఏర్పాటు చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా చేతుల కష్టాన్ని నమ్ముకున్నారు. బురుజులు ఎక్కి అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను నరికేశారు. కళ తప్పిన రాజకోటను రంగుల దీపాలతో అలంకరించారు. కోట లోపల చెత్తా చెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సాయికిరణ్, భాస్కర్, గంగాధర్, నవీన్,శేఖర్,సుదర్శన్ గౌడ్, సాయిబాబా, దత్తు,నర్సింహులు, ప్రవీణ్, సన్నీ,ప్రశాంత్ మాట్లాడుతూ...పాపన్నపేట కోటకు పూర్వవైభవాన్ని తెస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి పాపన్నపేట కోటలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.


