మెదక్ కలెక్టరేట్: తెలంగాణ సాయుధ రైతాంగం పోరాట స్ఫూర్తిని నేటి యువతరం అలవర్చుకోవాలని వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో కేవల్ కిషన్ భవనంలో శనివారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ప్రపంచ పోరాట చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోయిందన్నారు. అనంతరం మెదక్ సిటిజన్ ఫోరమ్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ...1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని గుర్తు చేశారు. గ్రామాలలో జరుగుతున్న వెట్టి చాకిరి, దోపిడీకి, అధిక వడ్డీ రేట్లకు వ్యతిరేకంగా మారి దున్నేవాడిదే భూమి అని భూస్వాముల, దేశముఖ్ ల సాయుధ గుండాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగినట్లు వివరించారు. ఆనాటి భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు తిరిగి గ్రామాల్లోకి వచ్చి సాయిధ పోరాటంలో పాల్గొన్న ప్రజలను భారత సైనికులు మిలటరీతో అణచివేసిన వైనాన్ని గుర్తు చేశారు. దీని ద్వారా సుమారు 2500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆనాడు నిజాం ప్రభుకు సంవత్సరానికి 50 లక్షల భరణంతోపాటు అన్ని సౌకర్యాలను కల్పించింది ఇండియన్ యూనియన్ ప్రభుత్వమేనన్నారు. ఈరోజు చరిత్రను వక్రీకరించడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పీడీ ఆనందం, బాగయ్య, బొందుగుల నాగరాజు, హరినాథ్, పవన్ కుమార్, నజరుద్దీన్, తిరుపతి, పద్మారావు, గణేశ్‌రెడ్డి, గోపాల్, సామెల్, హరిలాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల నాయకుల పిలుపు
మెదక్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం


