కొత్త సబ్‌స్టేషన్లు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

కొత్త సబ్‌స్టేషన్లు మంజూరు చేయండి

Aug 3 2026 9:13 AM | Updated on Aug 3 2026 9:13 AM

కొత్త సబ్‌స్టేషన్లు మంజూరు చేయండి వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యాలు సిద్ధింపజేద్దాం మీ మామిడి.. మాకు ఉపాధి దీపక్‌రెడ్డికి ఉత్తమ ఇన్నోవేటర్‌ అవార్డు

పాపన్నపేట(మెదక్‌): మండలంలో కొత్తగా రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని పాపన్నపేట, చీకోడ్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. మండలంలో వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటం వల్ల నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

యువతకు ప్రధాని మోదీ పిలుపు

వర్గల్‌(గజ్వేల్‌): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకర, బాధ్యతాయుత జీవనశైలి అలవర్చుకోవడం ద్వారా ‘వికసిత్‌ భారత్‌–2047‘లక్ష్యాలు సిద్ధింపజేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని మై భారత్‌ ‘నషా ముక్త యువ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌’కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశవ్యాప్తంగా యువతతో ప్రధానమంత్రి వర్చువల్‌గా సంభాషించారు. 100 రోజుల ‘క్యాంపస్‌ టు కమ్యూనిటీ ‘ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వేలాది విద్యార్థులు, 20,000 మంది పైగా మాస్టర్‌ వలంటీర్లు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం, పునరావాస కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కావేరి విద్యార్థులు మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వర్సిటీ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.శ్రీనివాసులు, వివిధ విభాగాల డీన్లు డాక్టర్‌ జి.పుష్పలత, డాక్టర్‌ సునీతా మెహతా, డాక్టర్‌ శ్రీనివాస్‌, ప్లేస్‌మెంట్‌ – ఇంక్యుబేషన్‌ హెడ్‌ డాక్టర్‌ సతీశ్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): మామిడి మొక్కలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనగానే ఉద్యానవన రైతులకు టక్కున గుర్తొచ్చేది సదాశివపేట మండలంలోని పెద్దాపూర్‌ నర్సరీలు. రాష్టంలోనే ఈ మామిడి మొక్కలు ప్రసిద్ధి చెందినవి. అయితే భీమవరం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడి నర్సరీల్లోని మామిడి మొక్కలకు అంట్లు కట్టడం కోసం వలస వచ్చారు. స్థానిక రైతులతో కలిసి వీరు ఉదయమే నర్సరీలకు చేరుకొని అప్రోచ్‌ గ్రాఫ్టింగ్‌ (తల్లి అంటు మొక్కలు) నిర్వహిస్తుండగా ఆదివారం ‘సాక్షి’ క్లిక్‌ మనిపించింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పెద్దాపూర్‌లో మాత్రం తల్లి చెట్ల నుంచి అంటుకట్టి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేయడం నేటికీ కొనసాగుతుంది. ఆరోగ్యకరమైన, మంచి రుచికరమైన ఫలాలను అందించే మొక్కలను ఇక్కడ తయారు చేస్తున్నారు. కాగా, ఒక్కో మొక్కకు అంటు కడితే కూలీలకు రూ.200 చెల్లిస్తున్నారు. రోజుకు దాదాపు 500 మొక్కలకు అంట్లు కడుతూ రూ. వెయ్యి సంపాదిస్తూ జీవనోపాధిని పొందుతున్నామని కూలీలు చెబుతున్నారు.

నారాయణఖేడ్‌: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచకు చెందిన కొంగరి దీపక్‌రెడ్డి ఉత్తమ ఇన్నోవేటర్‌ అవార్డును అందుకున్నారు. నీతి అయోగ్‌ సంస్థ వారు జూలై 31న రాష్ట్రపతి భవన్‌లో దేశవ్యాప్తంగా వివిధ ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీపక్‌ రెడ్డి రాముభవ్య ఇన్నోవేటర్స్‌ ద్వారా పొలాల్లో పేరుకుపోయిన రాళ్లను తొలగించి భూములను సాగులోకి తీసుకురావడానికి ఉపయోగపడే రుద్ర రాళ్లు ఏరే మిషన్‌ను రూపొందించారు. రాష్ట్రపతి ప్రదర్శనను తిలకించి దీపక్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకొని అవార్డుకు ఎంపిక చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బోరంచ సర్పంచ్‌ బీరప్ప, నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ దీపక్‌రెడ్డికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement