చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలో మోడల్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎస్టీ స్పోర్ట్స్ గురుకులం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. నిత్యం ఇక్కడికి రెండు ఆర్టీసీ బస్సులు విద్యార్థులను చేరవేస్తున్నాయి. అయితే ఈ పాఠశాలల వైపునకు వచ్చే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై మట్టి తేలింది. ఇటీవల వర్షాలకు బస్సు మట్టిలో కూరుకుపోగా, విద్యార్థులు ఆందోళన చెందారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు మోడల్ కాలనీలోనే మార్కెట్ కమిటీ గోదాం సైతం ఉండటంతో లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డును బాగుచేస్తే విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


