వచ్చే నెలలో వేసవి శిక్షణ శిబిరాలు
● జిల్లావ్యాప్తంగా 10 క్యాంపులు
● 25 రకాల క్రీడలు
వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా వచ్చే నెల నుంచి వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ఆయా మండలాల్లోని క్రీడాకారుల నుంచి మరో రెండు మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనుంది.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉండగా.. 10 వేసవి క్యాంపులు ఏర్పాటు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయి. మే 1 నుంచి నెలాఖరు వరకు ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 25 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా, ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 6 వేల చొప్పున పదింటికి రూ. 60 వేలు మంజూరు చేసింది.
అర్బన్‌లో నిర్వహించే క్రీడలకు ఫీజు
జిల్లావ్యాప్తంగా 25 రకాల వేసవి శిక్షణ శిబిరాలు (కీడలను) నిర్వహించనుండగా, వాటిలో అర్బన్ ప్రాంతంలో సగం, గ్రామీణ ప్రాంతాల్లో మరో సగం చొప్పున నిర్వహించాల్సి ఉంది. కాగా ఇందులో అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైనా ఫీజు చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ఏరియాలో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో ముఖ్యంగా అథ్లెంటిక్స్ క్రీడాకారుడు రూ. 400 చొప్పున చెల్లించాలి, బాస్కెట్‌బాల్‌కు రూ.400, బ్యాడ్మింటన్ రూ. 1,000, క్రికెట్, టేబుల్ టెన్నిస్ రూ.700, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్‌లకు రూ.600 చొప్పున ఫీజు నిర్ణయించారు.
వాడుకలో ఉన్న వాటికి ప్రాధాన్యం
వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 25 రకాల క్రీడలు ఉండగా, వాటిలో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లోని క్రీడాకారులు ఎక్కువగా ఏ క్రీడకు మొగ్గు చూపితే దానినే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం ఒక్కోదానికి ముందుగా రూ. 1000 ఇస్తారు. వాటితో క్రీడా మైదానం చదును, క్రీడాకారులకు తాగునీరు, తదితర అవసరాలకు ఉపయోగిస్తారు. క్రీడలు ముగిశాక ఒక్కో శిక్షణ శిబిరానికి రెమ్యూనరేషన్ కింద ఒక్కోదానికి రూ. 5 వేల చొప్పున పదింటికి మొత్తం రూ. 60 వేలు ఖర్చు చేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ
వేసవి శిక్షణ శిబిరాలను మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయా మండలాల పరిధిలోని పీఈటీలు, పీడీలతో పాటు గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వీటిని ఏర్పాటు చేసే అర్హత ఉంటుంది. కాగా అలాంటి వారి నుంచి ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిసింది.
సద్వినియోగం చేసుకోండి
మేలో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియో గం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అర్బన్‌లో 5, రూరల్‌లో 5 చొప్పున మొత్తం 10 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఒక్కో క్యాంపునకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది.
– రమేశ్, డీవైఎస్‌ఓ


