రామాయంపేట(మెదక్): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు అన్నదాత లు నానా అవస్థలు పడుతున్నారు. తేమ శాతం ఎక్కువగా లేకుండా చేసుకోవడానికి ధాన్యం ఆరబోతకు రహదారులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరబోసిన ధాన్యం కుప్పలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతేడాది జిల్లాలోని పలు రహదార్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలను ఢీకొని కనీసం నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
సమస్యను అధిగమించేందుకు..
ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు కలిగిన సన్న, చిన్న కారు రైతులు తమ సొంత పొలాల్లో కల్లాల నిర్మాణం చేపట్టేందుకు గతంలో అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు 90 శాతం రాయితీపై కల్లాల నిర్మాణం చేపట్టేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 1,600 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు. 250 మంది రైతులు నిర్మాణాలు ప్రారంభించినా, సకాలంలో నిధులు మ ంజూరు కాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత ఈ పథకం రద్దు కాగా, ఆశించిన స్థాయిలో అమలుకు నోచుకోలేదు.
రామాయంపేట–మెదక్ రోడ్డుపై ఆరబోసిన ధాన్యం
కల్లాలు లేక రైతుల అవస్థలు
రహదారులపై ధాన్యం ఆరబోత
రాత్రివేళ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
రైతులకు నోటీసులు
ప్రస్తుతం వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు తమ పంట ఉత్పత్తులను రహదారులపై ఆరబెట్టుకుంటున్నారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే జాతీయ రహదారిపై సైతం ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని హైవే అధికారులు, పోలీసులు చెబుతున్నారు. రహదారులపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈమేరకు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే కొత్తగా కల్లాల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కల్లాలు మంజూరు చేయాలి
వడ్లు ఆరబోసుకోవడానికి వీలుగా తమకు వంద శాతం సబ్సిడీపై కల్లాలు మంజూరు చేయాలి. ఈ సదుపాయం లేకపోవడంతో ధాన్యాన్ని రహదారుల, బో రు బావుల వద్ద ఆరబోసుకుంటున్నాం. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
– లాల్యనాయక్, చౌకత్‌పల్లి తండా


