● అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో మంత్రి వివేక్ ● హాజరైన ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి చంద్రశేఖర్
న్యాల్‌కల్(జహీరాబాద్): క్రమశిక్షణ, పట్టుదలతోపాటు చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని మంత్రి వివేక్ అన్నారు. మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ...నాడు అంబేడ్కర్‌కు జరిగిన వివక్షతవల్ల చదువుకు దూరమై ఉంటే నేడు రాజ్యాంగం నిర్మాతగా ఉండే వారు కాదన్నారు. అంతంతమాత్రంగానే ఉన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు ఆర్‌బీఐ స్థాపనలో కూడా ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించడంతోపాటు దళితులు, కార్మికుల హక్కులు, అంటరానితనం కోసం పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేడ్కర్ చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు. రాంతీర్థ్ నుంచి హద్నూర్ వరకు రోడ్డు బాగు చేయించాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఎంపీ సురేశ్ కుమార్‌షెట్కార్ మాట్లాడుతూ..అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలోని 140 కోట్లమంది నడుచుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎంపీలం సోనియాగాంధీ వద్దకు వెళ్లినప్పుడు అందులో వివేక్ పాత్ర ఎంతో కీలకమైందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనూస్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, సీనియర్ నాయకులు చంద్రప్ప, గౌని శివకుమార్, సిద్దిలింగయ్యస్వామి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


