చేగుంట(తూప్రాన్): ఆరుగాలం శ్రమ అకాల వర్షానికి కరిగిపోయింది. వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. పంట చేతికొచ్చే వేళ అన్నదాతల ఆశలు గాలి వానకు నెలకొరిగాయి. వారం క్రితం మండలంలోని మక్కరాజీపేట, కర్నాల్‌పల్లి, గొల్లపల్లి, రాంపూర్, కరీంనగర్‌తో పాటు వల్లభాపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి వరి పైరు నేలవాలింది. వరి కంకుల నుంచి గింజలు రాలిపోయాయి. పంట నష్టపోయిన వారిలో సగం మంది కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఎకరాకు రూ. 20 వేలకు పైగా పెట్టుబడి పెట్టి పంటలు వేసుకుంటే వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 5 వందల ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
అపార నష్టం మిగిల్చిన అకాల వర్షాలు
ప్రభుత్వం ఆదుకోవాలని
అన్నదాతల వేడుకోలు


