ముడుపులు! | - | Sakshi
Sakshi News home page

ముడుపులు!

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

సివిల్‌ సప్లై అధికారుల నిర్వాకం ఇటీవలే రూ.27.55 కోట్లు విడుదల బకాయిదారులకు రూ.7.01 కోట్లునిలిపివేత

మిల్లింగ్‌ చార్జీల చెల్లింపులోనూ సివిల్‌ సప్లై అధికారులు ముడుపులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లకోసారి వచ్చే మొక్కుబడి చార్జీల్లో మూడు శాతం కమీషన్‌ను అసోసియేషన్‌ ద్వారా వసూలు చేస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. ఇటీవల రూ.27.55 కోట్ల మిల్లింగ్‌ చార్జీలు విడుదల కాగా, అందులో బకాయిదారులకు సంబంధించి రూ.7.01 కోట్లు నిలిపివేశారు. కాగా వాటిని పొందేందుకు మిల్లర్లు పైరవీలు చేస్తున్నారు.

– మెదక్‌ అర్బన్‌

జిల్లాలో సుమారు 204 మిల్లులకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించారు. ఇందుకు గాను మిల్లింగ్‌ చార్జీల కింద క్వింటాల్‌ ధాన్యానికి బాయిల్డ్‌ మిల్లుకు రూ.20, రా మిల్లులకు రూ.10 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా గత ఏడేళ్లుగా మిల్లింగ్‌ చార్జీలు రాలేదు. ఇటీవల జిల్లాకు 2019– 2024 సంవత్సరాలకు సంబంధించి వరకు రూ. 27.55 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో క్లీన్‌చీట్‌ ఉన్న 114 మిల్లులకు రూ. 20.54 కో ట్లు చెల్లించారు. బకాయిలు, గ్యారంటీ ఇచ్చిన 90 మిల్లులకు సంబంధించి రూ.7.01 కోట్ల చెల్లింపులు నిలుపుదల చేశారు. కాగా కొంతమంది ఇతర మిల్లులకు గ్యారంటీ ఇవ్వడంతో వారికి రావాల్సిన మిల్లింగ్‌ చార్జీలు నిలిపివేసినట్లు సమాచారం.

మిల్లింగ్‌ చార్జీలచెల్లింపులోనూ కమీషన్‌

జిల్లాలో పదిహేనేళ్ల కాలంలో మిల్లర్లు సుమారు రూ.228.40 కోట్లు బకాయిపడ్డారు. ఇందులో కొంత మంది మిల్లర్లపై ఆర్‌ఆర్‌యాక్ట్‌, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొంత మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు వసూళ్లలో పెద్ద మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. మిల్లింగ్‌ చార్జీల నుంచి కొంతమేర నిలుపుదల చేసినా, అవి ఏ మూలకు సరిపోవు. కాగా తోటి మిల్లర్లకు గ్యారంటీగా సంతకం పెట్టిన వారి మిల్లింగ్‌ చార్జీలు నిలుపుదల చేయడంతో వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై డీఎం జగదీశ్‌ను వివరణ కోరగా, బకాయిలు వసూలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement