సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం గణనీయంగా పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆశాఖ అధికారులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన ఈ పనులకు ఎక్కువమందిని తీసుకురావాలని క్షేత్రస్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలు, మండలస్థాయిలో పనిచేసే ఉపాధిహామీ ఏపీఎంలను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు గ్రామాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామమైతే కనీసం 100 మంది కూలీలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 200లకు మించి కూలీల హాజరు సంఖ్య ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
కీలక మార్పుల నేపథ్యంలో..
నిరుపేద వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు స్థానికంగా పని కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పేరును వీబీజీరాంజీగా మార్చుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఇందులోభాగంగా కీలక మార్పులు చేసింది. మరో రెండు, మూడు నెలల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో కూలీల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచి పనులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఎండల తీవ్రత, వ్యవసాయ పనులు..
కూలీల హాజరు తక్కువగా ఉండటానికి ప్రధానంగా ఎండల తీవ్రతే కారణం. గత పక్షం రోజులు ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ పనులు చేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. దీంతో కూలీల సంఖ్య తక్కువ నమోదవుతోంది. మరోవైపు వ్యవసాయ పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వంటి ప్రాంతాల్లో జొన్న పంట కోతలు కొనసాగుతున్నాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వరి కోత దశకు చేరుకుంటోంది. దీంతో కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో హాజరు అనుకున్నంత మేరకు నమోదు కావడం లేదు.
జిల్లాల వారీగా టార్గెట్లు ఇలా..
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3.75 లక్షలమంది ఉపాధిహామీ కూలీలున్నారు. వీరికి 2.09 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఇందులో 1.85 లక్షలమంది కూలీలు మాత్రమే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీరోజు సుమారు 27,450 మంది కూలీలు ఈ పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను ప్రతీరోజు 40 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లాలో 3.84 లక్షలమంది కూలీలుండగా, 1.95 లక్షల జాబ్‌కార్డులున్నాయి. వీరిలో 1.86 లక్షలమంది కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తారు. ఇందులో ప్రస్తుతం రోజుకు 32,790 మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను 47,500లకు పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మెదక్ జిల్లాకు సంబంధించి 3.24 లక్షల మంది కూలీలుండగా, 1.63 లక్షల జాబ్‌కార్డులున్నాయి. ఇందులో 1.89 లక్షలమంది ఉపాధిహామీ పనులు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 33,110 మంది కూలీలు పనులకు వస్తే..ఈ సంఖ్యను 42,800లకు పెంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
ఈజీఎస్ కూలీల
హాజరు పెంచేందుకు టార్గెట్లు
గ్రామాల వారీగా మేట్లు,
ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్షలు
వీబీజీరాంజీగా పేరు మార్పు
నేపథ్యంలో కీలక నిర్ణయాలు


