ముగ్గురు లేదా ఐదుగురు సభ్యుల నియామకం!
ప్రత్యేకాధికారుల పాలనకు సెలవు ● జిల్లాలో 37 సొసైటీలు
ప్రాథమిక సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒక్కో పీఏసీఎస్‌కు ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో సందడి మొదలైంది.
– మెదక్ అర్బన్
జిల్లాలో 37 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, అవసరం మేర వ్యవసాయ, రుణాలు, ఎరువులు అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, ఇతర వినిమయ, ఆర్థిక సేవలు అందించడం సొసైటీల ముఖ్య లక్ష్యం. వచ్చిన లాభాలు కూడా రైతులకు పంచుతూ సహకార లక్ష్య సాధన దిశగా ఇవి కృషి చేస్తున్నాయి. సభ్య రైతులు తమ పాలకమండళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2020లో చివరిసారిగా ఎన్నికలు జరుగగా, వారి పదవీకాలం ఫిబ్రవరి 2025తో ముగిసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా, ఆరునెలల చొప్పున రెండుసార్లు వారి పదవీకాలం పెంచింది. 2025 డిసెంబర్ 18 నుంచి సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియిమించింది. కాగా జిల్లాలోని 37 సొసైటీలకు 20 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కొంతమందిలో ఒక్కొక్కరికి నాలుగు సొసైటీల బాధ్యతలను అప్పజెప్పారు. వీరు పని భారంతో అటు సొంత ఉద్యోగానికి, ఇటు సొసైటీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పీఏసీఎస్‌లో పాలన గాడి తప్పింది. ముఖ్యంగా యూరియా కొరత సమయంలో కూడా సొసైటీలు నిర్ణయాత్మక బాధ్యతలు నిర్వహించలేక పోయాయని రైతులు ఆరోపించారు.
నామినేటెడ్‌పై ఆశలు
నామినేటెడ్ పాలకవర్గాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సభ్యుల సంఖ్యపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు గడిచినా జిల్లాలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. అవకాశం ఉన్న ఏడుపాయల పాలకమండలి, మార్కెట్ కమిటీల ఏర్పాటుపై ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నారు. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం పీఏసీఎస్ పాలకమండళ్లను ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో పలువురు నాయకులు పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. అయితే పాలక చైర్మన్‌తో పాటు 3 నుంచి 5 మంది సభ్యులు ఉంటారా..? లేక మొత్తం పాలకవర్గ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నామినేట్ చేస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు.


