ఫార్మర్‌ రిజిస్ట్రీపై అనాసక్తి | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీపై అనాసక్తి

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

ముందుకు రాని రైతులు అడ్డంకులు తప్పనిసరి నమోదు చేసుకోవాలి

జిల్లాలో ఇప్పటివరకు 62 శాతం నమోదు

అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేస్తున్న సమయంలో రైతుల సెల్‌ఫోన్‌కు ఓటీపీలు వస్తుంటాయి. వాటిని చెబితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కలిగిన రైతులు పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వారు అందుబాటులో లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ రాకపోవడంతో నమోదు ప్రక్రియ ఆలస్యమవుతుంది.

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవాలని, లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు కోల్పోతారని వ్యవసాయ అధికారులు పదే పదే చెబుతున్నా, జిల్లాలో చాలా మంది రైతులు ముందుకురావడం లేదు. ఆరునెలల్లో పూర్తి చేయాలని కేంద్రం గతేడాది ఆదేశాలు జారీ చేసింది. నెట్‌వర్క్‌ సమస్యలు, రైతులు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండటం వల్ల ఆలస్యం జరగుతుంది. తాము ఎన్నిసార్లు గ్రామాల్లోకి వెళ్లినా.. రైతులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారుతుందని అధికారులు వాపోతున్నారు.

గతేడాది ప్రారంభం

జిల్లాలో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కలిగిన రైతులకు ప్రభుత్వ ప్రయోజనాల అందేలా ఆధార్‌ తరహాలో ప్రత్యేకంగా విశిష్ట గుర్తింపునిచ్చేందుకు ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ నమోదును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది ఏప్రిల్‌ 15 నుంచి అధికారులు నమోదు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 2,79,044 లక్షల మంది రైతులు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కలిగి ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 1,74,246 మంది ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమెదు చేసుకొని విశిష్ట గుర్తింపు సంఖ్య పొందారు. మరో 1,04,798 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో ఫార్మర్‌ రిజిస్టీ 62 శాతం నమోదు కాగా. జిల్లాలోని 76 క్లస్టర్లలో 76 మంది ఏఈఓలు నమోదు కార్యక్రమం చేపడుతున్నారు.

ప్రయోజనాలు

పీఎం కిసాన్‌కు అర్హత పొందడంతో పాటు పంటల బీమా లభిస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, రుణాలు, సబ్సిడీలు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. నమోదు చేసుకోవడానికి ఆధార్‌, పొలం పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌కు లింక్‌ అయన సెల్‌ఫోన్‌ అవసరమం. దీని ద్వారా రైతుల భూమి వివరాలు ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌తో లింక్‌ అవుతాయి.

జిల్లాలోని ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రీ చేసుకోకపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అ అందవు. రైతులు నమోదు చేసుకుంటేనే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి.

– దేవ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement