మీటర్లు గిర్రగిర్రా! | - | Sakshi
Sakshi News home page

మీటర్లు గిర్రగిర్రా!

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

వేసవిలో పెరుగుతున్న విద్యుత్‌ వాడకం

తగ్గుతున్న ‘గృహజ్యోతి’ లబ్ధిదారులు

మార్చిలో 3 వేల పైచిలుకు మంది అనర్హులు

మెదక్‌జోన్‌: ఎండలు దంచికొడుతుండటంతో జిల్లాలో విద్యుత్‌ వాడకం పెరిగింది. ఉదయం 9 గంటల నుంచే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఫలితంగా 200 యూనిట్లు దాటడంతో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారుతున్నారు. జిల్లాలో ఫిబ్రవరి నెలలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య 1,28,465 మంది కాగా, 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించిన వారు 1,27,150 మంది. మిగితా 1,315 మంది 200 యూనిట్ల కన్నా ఎక్కువగా విద్యుత్‌ వినియోగించటంతో అనర్హులుగా మారారు. అలాగే మార్చిలో 1,28,584 మంది లబ్ధిదారులకు గానూ 200 యూనిట్ల విద్యుత్‌ వాడింది 1,23,930 మంది. మిగితా 4,654 మంది 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ వినియోగించారు. కాగా కేవలం నెల రోజుల వ్యవధిలో 3,339 మంది గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు.

మేలో మరింత మంది..

జిల్లాలో గృహజ్యోతి (ఉచిత) విద్యుత్‌ పథకానికి 1.28 లక్షల మంది అర్హులు ఉన్నారు. మార్చిలో 4,654 మంది అనర్హులుగా మిగిలారు. ఏప్రిల్‌, మేలో వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా, మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగి లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా పేదలకు ప్రభుత్వం ప్రతీ నెల 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తోంది. కాగా 201 యూనిట్ల విద్యుత్‌ కాల్చి నా, రూ. 1,200 నుంచి రూ.1,300 వరకు బిల్లు చెల్లించాల్సిందే. ఈ విద్యుత్‌ వాడకంలో 50 యూనిట్ల వరకు ఒక్క లెక్క, 100 వరకు మరో లెక్క.. ఆపైనా మరో విధంగా యూనిట్లకు లెక్కలు కట్టాల్సి ఉంటుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అవసరం మేరకే వాడాలి

విద్యుత్‌ అవసరం మేరకు మాత్రమే వాడాలి. రాత్రి వేళల్లో అవసరం ఉన్నప్పుడు మాత్రమే బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్‌ చేయాలి. అవసరం లేకున్నా కొందరు బల్బులను బాతురూముల్లో వేసి ఉంచుతారు. దీంతో కరెంట్‌ వినియోగం పెరిగిపోయి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి నష్టపోవాల్సి వస్తోంది. ఫలితంగా నెలకు రూ. 1,200 నుండి రూ. 1,500 వరకు బిల్లులను చెల్లించాల్సి వస్తోంది

– నారాయణ నాయక్‌, విద్యుత్‌ ఎస్‌ఈ

Advertisement
 
Advertisement
Advertisement