కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నంబర్ 9391942254 ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. మెదక్ డిపోలో 100, నర్సాపూర్ నుంచి 37 బస్సులు ఉన్నాయని, తాత్కాలిక కండక్టర్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు వివరించారు. అలాగే డ్రైవర్ల కోసం దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీలో పోస్టుల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారిని పిలిపిస్తామన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణతో పాటు జిల్లాలోని అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నిజమైన జర్నలిస్టులకు కార్డులు అందేలా అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఆర్‌ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.


