● పుల్‌కుర్తిలో స్థలాన్ని పరిశీలించండి
● ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: పుల్‌కుర్తిలో కస్తూర్బాగాంధీ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం పుల్‌కుర్తిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించిన పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం అవసరమని, భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి, రెవెన్యూ అధికారులను కోరారు. కసూర్బాగాంధీ విద్యాలయంలో బోధనతీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దిగంబర్‌రెడ్డి, బిరాదర్ దత్తు, సిద్ధారెడ్డి, నర్సింహులు, పోతుల సంగారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.
త్వరగా ఇళ్ళను నిర్మించుకోండి
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. పుల్‌కుర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరేందుకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం వరంలా మారిందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయలేదని, డబుల్‌బెడ్రూం ఇళ్ళ పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు.


