కొరవడిన పర్యవేక్షణ ప్రజా సేవలకు ఆటంకం
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీకి సొంత భవనం లేకపోవడంతో పాటు రెగ్యులర్ కమిషనర్ సైతం లేరు. కీలక పాత్ర పోషించే వార్డు ఆఫీసర్ల పోస్టులతో పాటు ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రజలకు సేవలు అందడం లేదు. ప్రధానంగా పారిశుద్ధ్యం పనులపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా ఉండని అధికారులు
నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన శ్రీరాంచరణ్ రెడ్డి గత నెల 31న బదిలీ అయ్యాడు. దీంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి నర్సాపూర్ మున్సిపాలిటీ అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది స్థానికంగా ఉండటం లేదు. దీంతో ఉదయం పర్యవేక్షించాల్సిన పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, నీటి సరఫరా తదితర పనులపై పర్యవేక్షణ కరువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
15 మందికి నలుగురే..
మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ పోస్టు, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణతో పాటు హోటళ్లు తదితర వ్యాపార సంస్థల తనిఖీ చేసే అధికారి పోస్టు ఖాళీ గా ఉంది. దీంతో తనిఖీల ఊసే లేకుండా పోయింది. కాగా మున్సిపాలిటీలో 15 వార్డులకు 15 మంది వార్డు ఆఫీసర్లు ఉండాలి. కానీ నలుగురే ఉండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కొక్కరికి మూడు నుంచి నాల్గు వార్డులు కేటాయించారు. కాగా వార్డుల్లో పనులు, ఇతర సమస్యలపై పర్యవేక్షణ కొరవడింది. పలు వార్డుల్లో చెత్త సేకరించకపోవడంతో కూడళ్ల వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కాగా మున్సిపాలిటీలో రెగ్యులర్ కమిషనర్‌తో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
నర్సాపూర్ బల్దియాలో పోస్టులన్నీ ఖాళీలు
త్వరలో భర్తీకి చర్యలు
మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ త్వరలో రానున్నారు. ఇతర పోస్టుల్లో సైతం ఉద్యోగులను భర్తీ చేసేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వివేక్, జిల్లా మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాం నుంచి పలు పోస్టుల్లో ఇన్‌చార్జ్ ఉద్యోగులు ఉండి అలాగే కొనసాగుతున్నారు. ఆయా పోస్టులు భర్తీ అయ్యేలా కృషి చేస్తా.
– ఎం.లక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్


