● రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి ● సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు దిశానిర్దేశం
మెదక్ కలెక్టరేట్: జనగణన–2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి సూచించారు. మంగళవారం మెదక్ పట్టణంలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో కలిసి జనగణన సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతి హొళికేరి మాట్లాడుతూ.. వివరాలు పక్కాగా సేకరించి యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, రెండో దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరించాలన్నారు. అందరి వివరాలు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప్రణాళికలకు మార్గం
చేగుంట(తూప్రాన్): జనగణనలో సేకరించే సమాచారంతో అభివృద్ధి ప్రణాళికలకు మార్గం ఏర్పడుతుందని భారతిహోళికేరి అన్నారు. మంగళవారం వడియారంలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో భారతిహోళికేరి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేటర్లు నిర్వహించే సమాచార సేకరణ పారదర్శకంగా ఉండాలన్నారు. జన గణన నివేదికల ఆధారంగానే భవిషత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. జనగణనలో ప్రస్తావించే 33 అంశాలపై ఎన్యుమరేటర్లకు ఉన్న సందేహాలను భారతి హోళికేరి నివృత్తి చేశారు.


