సాక్షి ప్రతినిఽధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఉంటే పార్టీకే తీవ్ర నష్టమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మంగళవారం సంగారెడ్డిలో జరిగింది. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో శత్రువును తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్యా నించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడుదొడుకులు, గెలుపు ఓటములు సహజమేనన్నారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.
మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని మంత్రి దామోదర స్పష్టం చేశారు. ప్రత్యేకంగా బిల్లు పెడితే మద్దతిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
పాత, కొత్త అనే తేడాలు ఉండొద్దు
‘స్థానిక’ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలి
మంత్రి దామోదర వ్యాఖ్యలు
సంగారెడ్డిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం


