● గొంతుపై కమిలిన గుర్తులు ● అనుమానంతో కూతురు ఫిర్యాదు
టేక్మాల్(మెదక్): తన తండ్రి మృతిపై అనుమానం ఉందని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మండలంలోని సాలోజిపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వేముల పోచయ్య(76) చేతనైన పని చేస్తూ కుమారుడు శ్రీశైలం వద్ద ఉండేవాడు. ఈనెల 12న పోచయ్య అనారోగ్యంతో చనిపోయాడని బంధువులందరి సమక్షంలో పూడ్చిపెట్టారు. అంత్యక్రియలకు మృతుడి కూతురు టేక్మాల్ గ్రామానికి చెందిన ప్రమీల వచ్చి, పోచయ్య గొంతుపై కమిలిన గాయాలు కనిపించడంతో స్ఫృహతప్పి పడిపోయింది. కాగా ప్రమీలకు తన తండ్రి పోచయ్య భూమిలో కొద్ది భాగం ఇస్తానని గతంలో చెప్పడంతో పలుమార్లు తండ్రికొడుకుకు గొడవలవుతున్నాయి. తండ్రి మృతిపై అన్న శ్రీశైలంపై అనుమానం ఉందని ప్రమీల ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మంగళవారం అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, తహసీల్దార్ తులసీరామ్, అల్లాదుర్గం ఎస్‌ఐ శంకర్, హెడ్‌కానిస్టేబుల్ దేవిదాస్, సర్పంచ్ ఇర్షద్, గ్రామస్తుల సమక్షంలో ఫోరెన్సిక్ వైద్యులు జానిసేక్, చంద్రదీపక్ పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


