కౌడిపల్లి(నర్సాపూర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను తహసీల్దార్ కృష్ణ, కౌడిపల్లి ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలను ఎంపీడీఓ శ్రీనివాస్, గిరిజన బాలికల మినీ పాఠశాలను ఏఓ స్వప్న, జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, కిచెన్, డైనింగ్, హాస్టల్ గదులతో పాటు పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామారావ్, ఆయా గురుకుల ప్రిన్సిపాల్స్ హరిబాబు, ఫణికుమార్, మరోని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
ఎఫ్‌ఎస్‌ఓ కరీమొద్దీన్
కౌడిపల్లి(నర్సాపూర్): అడవులను రక్షించడం అందరి బాధ్యత అని ఎఫ్‌ఎస్‌ఓ (ఫారెస్ట్ సెక్షన్ అధికారి) కరీమొద్దీన్ తెలిపారు. సోమవారం మండల పరిధి వెంకటాపూర్(ఆర్)లో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల రక్షణకు అందరు సహకరించాలన్నారు. గొర్రెలు, మేకల కాపర్లు జీవాల మేతకోసం చెట్లను నరకవద్దని హెచ్చరించారు. అడవులను ఆక్రమించుకోవడం, మొక్కలను నరికివేయడం సరికాదన్నారు. వేసవి సందర్భంగా అడవిలో ఆకులు రాలి ఉంటాయని నిప్పుపెడితే అడవికి నష్టం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీట్ అధికారి మౌనిక, గ్రామస్తులు కుమార్, మహేశ్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలో సీమంతాలు
అల్లాదుర్గం(మెదక్): మండల పరిధి ముప్పారం అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం సీమంతాలు నిర్వహించారు. గర్భిణులకు కావాల్సిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు గుడ్లు, బాలామృతంతో పాలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం నాగలక్ష్మి, కార్యదర్శి గణేశ్, అంగన్‌వాడీ టీచర్లు సుభద్ర, రమాదేవి పాల్గొన్నారు.
పీఎంశ్రీ పాఠశాలలో చేర్చండి
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రం కౌడిపల్లిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని ఉపాధ్యాయులు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సోమవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పీడీ విజయ్‌కృష్ణ, ఉపాధ్యాయులు లక్ష్మన్‌రాజు, సీఆర్‌పీ అంజయ్య, ప్రశాంత్ తది తరులు మండలంలోని ధర్మాసాగర్, సదాశివపల్లి, బూరుగడ్డ, పాంపల్లి, మహమ్మద్‌నగర్ గేట్‌తండా పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులతో చర్చించి కౌడిపల్లిలోని పీఎంశ్రీ పాఠశాలలో చేర్పించాలని కోరారు. పాఠశాలలో మెరుగైన వసతులు, ఉత్తమ ఉపాధ్యాయులతో విద్యబోధన సాగుతుందని చెప్పారు.
రేషన్ బియ్యం లారీ పట్టివేత
తూప్రాన్: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. 44వ జాతీయ రహదారిపై 338 టన్నుల రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని పోలీసులకు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్న లారీని నమ్మదగిన సమాచారంతో టోల్‌ప్లాజా వద్ద పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీని సివిల్ సప్‌లై అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు. లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.


