పంట చేతికొచ్చే వేళ రైతన్న ఆగం
పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గత నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం వర్షం కురుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 3.4 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2.52 లక్షల ఎకరాల్లో దొడ్డు, 50,476 ఎకరాల్లో సన్న రకం పంటలను సాగుచేశారు. ఇందుకు సంబంధించి 7.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో 2.97 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల అవసరాలకు పోనూ, కొంత విత్తన కంపెనీలకు పోతుందని చెబుతున్నారు. మిగితా 4.45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 100 సెంటర్ల ద్వారా సన్నధాన్యం, 418 సెంటర్ల ద్వారా దొడ్డురకం ధాన్యం సేకరణకు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే చాలా వరకు కేంద్రాలను ప్రారంభించారు. అయితే తూకం మాత్రం కొన్ని సెంటర్లలో మాత్రమే మొదలుపెట్టారు. చాలా సెంటర్లలో ఇంకా ప్రారంభించలేదు. అలాగే కొనుగోలు కేంద్రాలు సైతం పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. అకాల వర్షాలు భయపెడుతున్న నేపథ్యంలో వేగంగా తూకం వేయాలని రైతులు వేడుకుంటున్నారు. అలాగే అకాల వర్షాల నుంచి ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు సరిపడా టార్పాలిన్లు సరఫరా చేయాలని కోరుతున్నారు.
పంటలకు తీవ్ర నష్టం
వెల్దుర్తి(తూప్రాన్): కష్టాలకు ఎదురీది పంటలు సాగు చేసిన రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నోటి కాడి బుక్క నీటిపాలవడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోగా, కోతకు వచ్చిన వరి నేలవాలింది. కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
వెల్దుర్తి: నేలరాలిన వరి ధాన్యం
తడిసి ముద్దవుతున్న ధాన్యం
త్వరగా తూకం చేయాలని వేడుకోలు


